టెక్నాలజీ వార్తలు

ఈ వెబ్‌సైట్‌ నుంచి షాపింగ్‌ చేస్తే మీ డబ్బులు గోవిందా..!!

Written by Tolly2Bolly

ఎవ్వరికి దక్కని ఓ పెద్ద బహుమతి మీకు దక్కిందంటూ ప్రచారం చేసే కంపెనీలను అవగాహన ఉన్న వారు నమ్మకపోయినా మరి కొందరు వారి బుట్టలో పడుతున్నారు. ఫలితంగా లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. కంపెనీలు కూడా అమాయకులైన వారిని ఆకర్షిస్తూ చివరికి చిప్ప చేతిలో పెడుతున్నారు..!

 

తాజాగా హైదరాబాద్‌లోని ఓ కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మీకు రూ. 2.5 లక్షల గిఫ్టు వచ్చిందంటూ ఓ మహిళను నమ్మించి  రూ. 1.8 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌కు చెందిన అఖిల హోమ్‌షాప్‌18.కామ్‌ లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తరువాత, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. మీరు హోమ్‌షాప్‌18.కామ్‌లో షాపింగ్‌ చేయడంతో మీకు రూ. 2.5 లక్షల గిప్టు వచ్చిందంటూ నమ్మించారు. అయితే డాక్యుమెంట్లు వెరిఫికేషన్‌ చేసేందుకు రూ. 8500 చెల్లించాలంటూ సూచించడంతో ఆమె ఆ డబ్బులను వారు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది.అనంతరం డబ్బులు బ్యాంకులో డిపాజిట్‌ చేయాలంటే మరిన్ని క్లియెరెన్స్‌లు అవసరమున్నాయంటూ దఫదఫాలుగా ఫోన్లు చేస్తూ రూ. 10 వేలు, రూ. 20 వేలు బ్యాంకులలో డిపాజిట్‌ చేయించారు.

అయితే అఖిల ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి భీమ్‌ యాప్‌ నుంచి సైబర్‌ఛీటర్లు సూచించిన బ్యాంకు ఖాతాలకు డబ్బులు డిపాజిట్‌ చేసేవాడు. ఇలా నగదు బదిలీ చేసినందుకు వెయ్యికి రూ. వంద కమిషన్‌ తీసుకునేవాడు. ఒక పక్క సైబర్‌ఛీటర్లు చెప్పినట్లు నగదు బదిలీ చేస్తూ, మరో పక్క ఆ డబ్బుకు అదనంగా కమిషన్‌ ఇస్తూ అఖిల నిండుగా మునిగిపోయింది.

మొత్తం రూ. 1.8 లక్షలు బదిలీ చేసినా ఇంకా డబ్బు కావాలంటూ సైబర్‌ఛీటర్లు అడుగుతుండడంతో అనుమానం వచ్చి, ఆమె  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఐదారు మందికి ఇలానే సైబర్‌ ఛీటర్లు ఫోన్‌ చేసి మోసాలు చేశారని, ఈ వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ కొనుగోలు చేయొద్దంటూ సూచిస్తున్నారు.

About the author

Tolly2Bolly

Leave a Comment